టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండడంతో.. ఇప్పటి నుంచే పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. తమకు పార్టీకి గతంలో బాగా పట్టున్న ప్రాంతాల్లో.. మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే టీడీపీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 2018 ఎన్నికల తర్వాత తెలంగాణలో చంద్రబాబు నాయుడు బహిరంగసభ నిర్వహించడం ఇదే తొలిసారి. ఐతే ఇవాళ్టి సభలో తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ఏం మాట్లాడతారన్నది హాట్ టాపిక్‌గా మారింది. కేవలం పార్టీ బలోపేతం గురించే మాట్లాడతారా? లేదంటే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తారా? అని ఆసక్తి నెలకొంది.
పర్యటన వివరాలిలా..
ఉదయం 9.30 గంటలకు రసూల్‌పుర లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించనున్న చంద్రబాబు అక్కడి నుంచి హబ్సిగూడ, ఉప్పల్, ఎల్బినగర్, హయత్ నగర్ ల మీదరుగా టేకుమెట్ల బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కేశవాపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం చేరుకుని మయూరి జంక్షన్ నుంచి ర్యాలీగా సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్క టీడీపీ శంఖారావం పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం అక్కడ నుంచి నేరుగా బయలుదేరి రోడ్డుమార్గాన విజయవాడ ఉండవల్లి తన నివాసానికి చేరుకుంటారు.