మువ్వెన్నెల ఫేస్ మాస్క్‌లపై అభ్యంతరం.. దూరంగా ఉండండి! - MicTv.in - Telugu News
mictv telugu

మువ్వెన్నెల ఫేస్ మాస్క్‌లపై అభ్యంతరం.. దూరంగా ఉండండి!

August 13, 2020

Former Goa CM Digambar Kamat demands ban on masks with tricolour pattern.

కరోనా వైరస్ నివారణకు రకరకాల ఫేస్ మాస్కులు అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యాషన్ డిజైనర్లు అయితే వారు ఏ కొత్త రకం బట్టలు రూపొందించినా దానికి మ్యాచింగ్‌గా మాస్కును కూడా రూపొందిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. మాస్కు తాత్కాలికం కాదనిపిస్తోంది. మాస్కులు ఇకపై మన జీవితంలో రెగ్యులర్‌గా భాగం అవుతున్నట్టుగానే ఉన్నాయి. ఈ క్రమంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి రకరకాల మాస్కులను రూపొందిస్తున్నారు. తాజాగా అశోక‌చ‌క్రంతో కూడిన త్రివ‌ర్ణ ప‌తాకాన్ని పోలిన మాస్కులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటి పట్ల పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ జెండాను పోలిన మాస్కులు చేయడమేంటని.. ఇలాంటి మాస్కుల‌ను నిషేధించాలని గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబ‌ర్ కామ‌త్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ జెండాలను పోలి ఉన్న మాస్కుల‌ను చూసి తాను చాలా బాధ‌ప‌డ్డానని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జాతీయ‌జెండాను పోలిన మాస్కులు లభ్యమవుతుండడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటివి విక్రయించకుండా అన్ని రాష్ట్రాల‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. మన జాతీయ జెండాను మనందరం గౌర‌విద్దామ‌ని ఆయన పిలుపునిచ్చారు. ‘మాస్కులను వాడేశాక పారేస్తుంటాం. మన జెండా ఉన్న  మాస్కులను కూడా పారేయాల్సి వస్తుంది. అవి చెత్తబుట్టల్లో, రోడ్ల పక్కనా కనిపించడం అంటే మన జాతీయ పతాకాన్ని మనం అవమానించుకున్నట్టే. అందుకే వాటికి దూరంగా ఉండడమే మంచిది’ అని ఆయన తెలిపారు.