భారత మాజీ క్రికెటర్ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

September 15, 2020

Former India Cricketer Sadashiv Raoji Patil Dies

భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావూజీ పాటిల్ కన్నుమూశారు. 86 ఏళ్ల వయసున్న ఆయన కొల్హాపూర్‌లోని రుయ్‌కార్ కాలనీలోగల తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాత్రి భోజనం చేసి పడుకున్న పాటిల్‌ నిద్రలోనే చనిపోయారు. తెల్లవారుజామున ఎంతకీ నిద్రలేవక పోయేసరికి కుటుంబసభ్యులు ఆయన మరణించిన విషయాన్ని గుర్తించారు. పాటిల్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆయన మృతివార్త తెలిసిన ప్రముఖులు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

కాగా, పాటిల్ 1955లో భారత్ తరఫున ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత తిరిగి ఎప్పుడూ దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం ఆయనకు దక్కలేదు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన ఆయన న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడారు. అయితే, మహారాష్ట్ర తరఫున మాత్రం 1952-64 మధ్య ఆయన 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. ఆ టెస్టులో 866 పరుగులు, 83 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పారు. అంతేకాకుండా ఒక రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర రంజీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు.