Former IPS Kiran Bedi reacts on Shraddha Walker incident
mictv telugu

ఆడపిల్లలు లవర్‌‌‌తో వెళ్లిపోయినా మీరు వదలకూడదు – కిరణ్ బేడీ

November 16, 2022

Former IPS Kiran Bedi reacts on Shraddha Walker incident

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్యోదంతంతో పేరెంట్స్ భయభ్రాంతులకు గురవుతున్నారు. రాజధాని నగరంలో జరిగిన ఈ పాశవిక, కిరాతక హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు. దీంతో అతడిని వెంటనే ఉరి తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ దారుణ ఘటనపై తమ విచారం వ్యక్తం చేస్తూ యువతి కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందిస్తూ పేరెంట్స్‌‌కి కీలక సూచనలు చేశారు. ‘కూతుళ్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ మైకంలో మీతో ఎలాంటి సంబంధం లేదని, ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నా సరే. మీరు ఆ మాటలను పట్టించుకోకూడదు.

వాళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి. శ్రద్ధా వాకర్ కేసులో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. కానీ ఆమె అడ్రస్ గురించి పేరెంట్స్ ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈ ఘోర ఘటనకు వారు కూడా బాధ్యులే. ఆమె బాగోగుల గురించి వారు పట్టించుకుని ఉండాల్సింది. ఆమె ఫ్లాట్ చుట్టుపక్కల వాళ్లు, ఓనర్ సైతం బాధ్యతగా ఉండాల్సింది. మొత్తానికి ఈ ఘటనలో పేరెంట్స్‌‌తో పాటు సమాజం, స్నేహితుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లో తల్లులు అమ్మాయిలను స్వతంత్ర భావజాలం అలవర్చుకునేలా పెంచాలి. ఆ తర్వాత వారు ఎక్కడ ఉంటారో? ఎలా బతుకుతారో? అనే ఆందోళణ అవసరం లేదు. వారికి భరోసా ఇవ్వడం కుటుంబం బాధ్యత. డేటింగ్ యాప్‌‌లో అఫ్తాబ్ శ్రద్ధా వాకర్‌‌కి ఎలా పరిచయమయ్యాడో అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేయాలి’ అని అభిప్రాయపడ్డారు.