Former Karnataka Chief Minister HD Kumaraswamy met Telangana CM KCR
mictv telugu

సీఎం కేసీఆర్‌తో హెచ్‌డీ కుమారస్వామి భేటీ.. దేశ రాజకీయాలపై చర్చ

September 11, 2022

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో ఇద్దరు నేతలు తెలంగాణ అభివృద్ధి, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్రపై చర్చిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ పోషించాల్సిన కీలక పాత్రతతో పాటు తదితర జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి చర్చిస్తున్నారు. అంతకు ముందు ప్రగతి భవన్‌కు చేరిన హెచ్‌డీ కుమారస్వామికి కేసీఆర్‌ సాదర స్వాగతం పలికి.. వెంట తోడుకొని వెళ్లారు. సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనచారి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌ తదితరులు ఉన్నారు.

కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీ పెడుతారనే చర్చ నేపథ్యంలో కుమారస్వామితో కీలక భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో సీఎం కేసీఆర్, మాజీ ప్రధాని దేవెగౌడతో బెంగళూర్ లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రాంతీయపార్టీలు, నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో దేవెగౌడతో జరిగిన చర్చలకు కొనసాగింపుగానే తాజాగా కుమారస్వామి, సీఎం కేసీఆర్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపేతర ఫ్రంటులను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు.