ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నానంటూ మీడియాలో వస్తున్నాయి. ఈ నెల 18న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారని ఆ వార్తల సారాంశం. ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ.. తాను బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరాల్సి వస్తే.. దొంగచాటుగా అమెరికాలోనే లేదా ఢిల్లీలోనే కండువా కప్పుకోనని అన్నారు. ఖమ్మం నడిబొడ్డున 2.50 లక్షల మంది అభిమానుల సమక్షంలో కండువా కప్పుకుంటానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను వీడాల్సి వస్తే బహిరంగంగా ప్రకటిస్తానన్నారు.
ఆలూ లేదు చూలు లేదు… కొడుకు పేరు సోమలింగం అన్న తరహాలో తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని పొంగులేటి సెటైర్ వేశారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటానని, తనను నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలోకి దిగుతానని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో నిన్న విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
కాగా, పొంగులేటి బీజేపీలో చేరిక దాదాపు ఖాయమైపోయిందని తెలుస్తోంది. తన వెంట ఉన్న నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దిగుతారని చెప్పారు. కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం చెప్పలేదు.