టీడీపీలో ఉన్నప్పుడు బాబును దింపడానికి కేసీఆర్ కుట్రలు చేశారు : బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీలో ఉన్నప్పుడు బాబును దింపడానికి కేసీఆర్ కుట్రలు చేశారు : బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

June 2, 2022

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా కేసీఆర్ ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అందుకు తనకు మద్ధతుగా 60 మంది ఎమ్మెల్యేలను కూడా కూడగట్టారని వెల్లడించారు. కేసీఆర్ అధికార దాహం ఎంతుందో దీనిని బట్టి అర్ధం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లోనే.. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్యేలలో చీలిక తేవడానికి కేసీఆర్ ప్రయత్నించారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో పాటు మరికొంతమందితో కలిసి చంద్రబాబును దింపేసి తాను సీఎం కావాలని చూశారు. ఒక సమయంలో 60 మంది ఎమ్మెల్యేలను కూడగట్టారు. నన్ను కూడా సంప్రదించారు. ఈ 60 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను ఇంటికెళ్లి కలిసి, ఆ తర్వాత చంద్రబాబును కలిశారు. ఈ విషయాన్ని జ్యోతుల నెహ్రూ పసిగట్టి చంద్రబాబుకు చెప్పడంతో ఆయన అప్రమత్తమై 60 మంది ఎమ్మెల్యేలను విడగొట్టి ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. కేసీఆర్ అధికార దాహానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ’ అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి కూడా చంద్రశేఖర్ వివరించారు. ‘ఎన్నికల్లో దళిత సీఎం ప్రస్తావన చేయవద్దంటూ విజయరామారావు చెప్పినా కేసీఆర్ వినిపించుకోలేదు. చివరికి నన్ను కూడా తెలంగాణ తొలి సీఎం నువ్వేనని దళితుడినైన నన్ను మభ్యపెట్టారు. చివరికి ఆయనే ముఖ్యమంత్రి అయ్యార’ని వెల్లడించారు. కాగా, కేసీఆర్, చంద్రశేఖర్‌లు ఒకేసారి ఎమ్మెల్యేలయ్యారు. ఇద్దరూ టీడీపీలో పనిచేశారు. కేసీఆర్ కంటే చంద్రశేఖర్ ముందుగా మంత్రి అయ్యారు.