ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు చెప్తుండగా, ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అనుకోలేదని, వైసీపీలో ఉన్నందుకు తనకే అసహ్యం వేస్తుందని విమర్శించారు. తానున్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అంతేకాక, జగన్ అధికారంలోకి రాకముందు జరిగిన ఓ ఆసక్తికర ఉదంతాన్ని వెల్లడించారు. ‘ఎన్నికలకు ముందు కొందరు ముఖ్యమైన రెడ్లు సమావేశమయ్యారు. అందులో జగన్.. అన్నా నాకుంది ఇద్దరూ కూతుళ్లే కదా. ఆల్రెడీ మా నాన్న ద్వారా వచ్చిన రూ. 30, 40 వేల కోట్ల ఆస్తులున్నాయి. నేను అవినీతికి పాల్పడకుండా మంచిపేరు తెచ్చుకుంటాను’ అని చెప్పినట్టు ఆ ముఖ్యమైన రెడ్లు తనతో చెప్పినట్టు తెలిపారు. ‘నాతో కూడా జగన్ ఇదే మాట చెప్పాడు. కానీ పరిపాలన మొదలైనప్పటినుంచి అవినీతే. మాలాంటి వాళ్ల సలహాలు తీసుకుంటే కదా పరిపాలన మంచిగా సాగేది. అలా కాకుండా డబ్బు కోసమే పరిపాలిస్తే ఎలా? ప్రస్తుతం నేను వైసీపీలోనే ఉన్నాను. నా పనితీరు తెలిసిన ఏ పార్టీ అయినా వచ్చే ఎన్నికల్లో నన్ను తీసుకుంటుందని ఆశిస్తున్నా. నాకుగా వెళ్లి ఏ పార్టీని టికెట్ అడగను. ఇంకా ఏ పార్టీ నుంచి ఆఫర్ రాలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుంది. ఏ దేవుడు వచ్చినా రాష్ట్రాన్ని కాపాడలేడు. 94లో నేను విపక్ష పార్టీలో ఉన్నాను. అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ పెట్టిన పథకాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారింది. 95లో ఎన్టీఆర్ దిగిపోయారు. అప్పుడు చంద్రబాబే రాష్ట్రాన్ని గాడిన పెట్టారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తే బాగుంటుంది. పవన్ కి నిజాయితీ ఉన్నా పరిపాలన దక్షత ఉందనుకోను’ అని అభిప్రాయపడ్డారు.