మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూత
మాజీ మంత్రి, టీడీపీ పార్టీ సీనియర్ నేత పసుపులేటి బ్రహ్మయ్య గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బ్రహ్మయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. బ్రహ్మయ్య మృతివార్త తెలిసి పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన కుటంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
కాగా, ఆయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో అమరావతిలోని రమేశ్ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకున్నారు. అనంతరం కాస్త కోలుకున్నారు. 2019 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నారు. కానీ, ఆయనకు టీడీపీ అధిష్ఠానం సీటు ఇవ్వలేదు. సాధారణ కార్యకర్తగా టీడీపీలో చేరిన బ్రహ్మయ్య.. 1994లో రాజంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖాదీ బోర్డు చైర్మన్‌గా, చంద్రబాబు కేబినెట్‌లో చిన్నతరహా పరిశ్రమలు, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు.