మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ కె. విజయరామారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సీబీఐ డైరెక్టర్ గా పనిచేసిన విజయరామారావు 1999లో టీడీపీ తరఫున రాజకీయా ఆరంగ్రేటం చేశారు. మొదటి ఎన్నికలోనే సంచలనం సృష్టించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి నిలబడి కాంగ్రెస్ కీలక పి.జనార్థనరెడ్డి పై విజయం సాధించారు. తర్వాత చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి దానం నాగేందర్ చేతిలో ఓడిపోయారు.రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ లో చేరినా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
విజయరామారావు రాజకీయాల్లోకి రాకముందు సీబీఐ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన 1959 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. సీబీఐ డైరెక్టర్ హోదాలో బాబ్రీ మసీదు కేసు, హవాలా స్కాం, ఇస్రో గూఢచర్యం కేసు, ముంబయి బాంబు పేలుళ్ల కేసుల దర్యాప్తు చేసిన అధికారుల్లో ఒకరిగా ఉన్నారు.
విజయరామారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విజయరామారావుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు.