సోదరుడి హత్య కేసులో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యేపై కోర్టు తీర్పు ఇదీ - MicTv.in - Telugu News
mictv telugu

సోదరుడి హత్య కేసులో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యేపై కోర్టు తీర్పు ఇదీ

May 13, 2022

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌కు భారీ ఊరట లభించింది. సోదరుడి హత్య కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు ఆయన్ను నిర్ధోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండల పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన ఎర్రశేఖర్‌ సోదరుడు ఎర్ర జగన్‌మోహన్‌ 2013 జూలై 17న హత్యకు గురయ్యాడు. దేవరకద్ర బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో జగన్‌మోహన్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన దేవరకద్ర పోలీసులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ఆయన భార్య భవానీతో పాటు మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు.

హత్య జరిగిన ఆ సమయంలో చింతకుంట సర్పంచ్ పదవిని తమ భార్యలు పోటీ చేయించాలని ఇద్దరు అన్నదమ్ములు వాదులాడుకున్నారు. ఎర్ర శేఖర్ భార్య భవానీ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయగా ఎర్ర జగన్‌మోహన్‌ భార్య అశ్విత సైతం నామినేషన్ దాఖలు చేయడం విబేధాలకు కారణమైంది. జగన్‌మోహన్‌ హత్య కేసులో దేవరకద్ర పోలీసులు ఎర్రశేఖర్, భవానీతో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపారు. కేసును విచారించిన ప్రజా ప్రతినిధుల కోర్టు… సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టేసింది. ఈ మేర‌కు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కోర్టు శుక్ర‌వారం ఈ కేసులో కీల‌క తీర్పు చెప్పింది.