తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నా యి. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన దివంగత మాజీ ఎమ్మెల్యే పి.జనార్దన్ రెడ్డి కుమార్తె, కార్పొరేటర్ విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో కీలక నేత కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గత కొంతకాలంగా ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2 రోజుల క్రితం తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ లో సరైన గుర్తింపు లేదని, అధిష్టానం స్పందించకపోతే పార్టీని వీడుతానని తేల్చి చెప్పారు. అనుకున్నట్లుగానే రెండు రోజుల్లోనే కండువా మార్చేశారు తాటి వెంకటేశ్వర్లు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం సాగడంతో… ఈన్నాళ్లు అందుకోసం ఎదురుచూశాడని తెలుస్తోంది. పొంగులేటితో ఇటీవల కేటీఆర్ సమావేశం కావడంతో ఆయన కారు పార్టీలోనే ఉంటారనే క్లారిటీ వచ్చింది. దీంతో తాటి తన దారి తాను చూసుకున్నారని చెబుతున్నారు.