Former MMARO of Shakepet..suspicious death
mictv telugu

షేక్‌పేట మాజీ ఎమ్మార్వో..అనుమానాస్పద మృతి

September 3, 2022

హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం ఆమె గుండెపోటుతో నిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో శనివారం రోజున ఆమె ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. అనంరతం పోలీసు అధికారులు సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

గతంలో షేక్‌పెట తహసీల్దార్‌‌గా సుజాత విధులు నిర్వహిస్తున్న సమయంలో..బంజారాహిల్స్ రోడ్‌ నంబర్‌ 14లోని ఓ భూవివాదంలో లంచం ఆరోపణలపై 2020 జూన్‌ 8న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఖాలీద్ అనే వ్యక్తి నుంచి ఆమె లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతోపాటు, ఆమె ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీకి రూ.30 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దొరికాయి. వాటికి సంబంధించి ఎమ్మార్వో సరైన ఆధారాలు చూపకపోవడంతో.. భూవివాదం కేసు వ్యవ‌హారంలో ఆమె పాత్రను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో ఆమె భర్త అజయ్.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాతకు మళ్లీ విధుల్లోకి చేరేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా, ఆమె తిరస్కరించారు. డిప్రెషన్‌లోకి వెళ్లిన సుజాత..తాజాగా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తొలుత ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.