జులై 1 న బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

జులై 1 న బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

June 29, 2022

Former  MP Konda Vishweshwar Reddy to join BJP on July 1

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. వీరు దాదాపు గంటపాటు సమావేశం అయ్యారు. కాగా, జూలై 1వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. గత ఏడాది కాలంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

బీజేపీలో చేరడంపై విశ్వేశ్వర్‌రెడ్డికి ఉన్న సందేహాలను బీజేపీ నేతలు నివృత్తి చేసి, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడించినట్లు తెలుస్తోంది. విశ్వేశ్వర్ రెడ్డితో పాటు జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందుగానే మరికొంత మంది నేతలను చేర్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరికొందరు కీలక నేతలు కూడా బీజేపీ లో చేరే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి.

తెలంగాణ ఉద్యమకారుడు.. మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వరరెడ్డి.. టీఆర్‌ఎస్‌ తరపున 16వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు US పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో.. అఫిడవిట్‌ ఆధారంగా రిచ్చెస్ట్‌ పొలిటీషియన్‌గా నిలిచారు కూడా. 2013లో కేసీఆర్‌ ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. 2018లో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కిందటి ఏడాది మార్చిలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.