Former MP Kothapalli Geetha, her husband convicted in bank cheating case, lodged in prison
mictv telugu

బ్యాంకుకు ఎగనామం.. మాజీ ఎంపీ దంపతులకు 5 ఏళ్లు జైలు శిక్ష

September 15, 2022

తప్పుడు పత్రాలతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసి రూ.42.76 కోట్ల రుణం తీసుకున్న కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించింది. వారితో పాటుగా సహకరించిన బ్యాంకు అధికారులకు కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. గ్రూప్ 1 అధికారిగా పని చేసిన కొత్తపల్లి గీత.. భర్తతో కలిసి విశ్వేశ్వర ఇన్‌ఫ్రా.లిమిటెడ్ సంస్థ నిర్వహించారు. ఆ సంస్థ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ 42 కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవటంతో బ్యాంకు అధికారులు కేసు నమోదు చేసారు. విచారించిన సీబీఐ అధికారులు తప్పుడు పత్రాలు..సమాచారంతో రుణం తీసుకున్నట్లుగా గుర్తించారు. ఇందుకు సహకరించిన బ్యాంకు అధికారుల పైన కేసు నమోదు చేసారు. 2015 జూలైలోనే దీనికి సంబంధించి కేసు నమోదైంది. దీని పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ..ఉద్దేశ పూర్వకంగానే రుణం కట్టకుండా బ్యాంకును మోసం చేసారని అభియోగాలు నమోదు చేసింది.

ఇందులో ప్రధాన నిందితుడు పి.రామకోటేశ్వరరావు కాగా, గీత 4వ నిందితురాలిగా ఉన్నారు. వీరితోపాటు బ్యాంకు అధికారులు బి.కె.జయప్రకాశం, కె.కె.అరవిందాక్షన్‌, ఎస్‌.రాజ్‌కుమార్‌లను నిందితులుగా సీబీఐ పేర్కొంది. రెండో నిందితుడు బి.కె.జయప్రకాశం కేసు విచారణలో ఉండగానే మరణించడంతో ఆయనను తప్పించారు. విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు బుధవారం తీర్పు వెలువరించారు. రామకోటేశ్వరరావు, గీత, రాజ్‌కుమార్‌లకు 4 అభియోగాల్లో వేర్వేరుగా ఐదేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ.25వేల చొప్పున రూ.లక్ష జరిమానా విధించారు. అరవిందాక్షన్‌‌కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.75వేల జరిమానా విధించారు. శిక్షలన్నీ ఏకకాలంలోనే అమలు చేయాలని.. ఇప్పటికే శిక్ష అనుభవించి ఉంటే ఆ మేరకు మినహాయింపు ఉంటుందని కోర్టు తెలిపింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా 6 నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలన్నారు. సీబీఐ కోర్టు తీర్పు తర్వాత నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు.