తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ, BRS అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వంలోని పాలకులు కేవలం గొప్పలు చెప్పుకోవడం, నామస్మరణ కోసం తప్ప.. రాష్ట్ర ప్రజల బాగోగులను గురించి ఆలోచించడం లేదన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం నిర్మించే బదులు.. ఆ డబ్బును కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఎందుకు ఖర్చు చేయడం లేదన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మాట్లాడారు. ఈ సమావేశానికి కొంతమంది నాయకులు, కార్యకర్తలను రాకుండా అధికార బలంతో కొందరు అడ్డుకున్నారని మండిపడ్డారు. కానీ.. వారందరి నుంచి తనను వేరు చేయలేరనన్నారు.
తనను ఒంటరిని చేశామని అనుకుంటే అది వారి తెలివితక్కువ తనమే అవుతుందన్నారు పొంగులేటి. ప్రజల నుంచి తనను వేరుచేయటం ఎవరి తరమూ కాదని చెప్పారు. పొద్దు గూకిన తర్వాత ఏగూటి పక్షి ఆగూటికే చేరుతుందన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంలోకి వచ్చిన 9 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజలు కన్నకలలను ఏ మేర నెరవేర్చామన్నది, అధికారంలో ఉన్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క నెలలోనే ధరణిని క్రమపద్ధతిలో పెడతామని ప్రభుత్వం చెప్పినా, ఏడాదిన్నరగా రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 16 నెలలు దాటినా ధరణిలో పరిష్కారానికి నోచుకోని అంశాలు పదికిపైనే ఉన్నాయన్నారు.ఈ విషయం పాలకులకు తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా..? లేక తెలిసినా పరిష్కారం చేయొద్దన్న కృత నిశ్చయంతో ఉన్నారా అని పొంగులేటి ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసి ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఎందుకు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు.