Former odisha cm giridhar gamag and son sishir joinein kcr brs Hyderabad
mictv telugu

ఒడిశాలో పాగా వేసిన బీఆర్ఎస్‌

January 27, 2023

Former odisha cm giridhar gamag and son sishir joinein kcr brs  Hyderabad

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఒడిశాలో పాగా వేసింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ మాజీ నేత గిరిధర్ గమాంగ్ శుక్రవారం సాయంత్రం గులాబీ కండువా కప్పుకున్నారు. గిరిధర్ తనయుడు శిశిర్ గమాంగ్ కూడా కేసీఆర్ గూటికి చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరితోపాటు ఒడిశాకు చెందిన పలువురు నేతలను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో రామచంద్ర హన్సాదా, బృందావన్ మాజి, జయరామ్ పాంగి, మయాధర జేనా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ గిరిధర్ గమాంగ్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లయినా పేదరికం పోలేదని, సహజ వనరులను వాడుకోవడంలో విఫలమయ్యాయని ఎప్పట్లాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు సంధించారు.

దక్షిణ ఒడిశాలో కాస్త బలం
గిరిధర్ గమాంగ్ ప్రస్తుతం రాజకీయాల్లో అంత చురుగ్గా లేడు. బీజేపీ తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన గులాబీ గూటికి చేరారు. గిరిజనుడైన 79 ఏళ్ల గిరిధర్ గమాంగ్‌కు దక్షిణ ఒడిశా రాజకీయాల్లో కాస్త పట్టుంది. అక్కడి నాలుగు లోక్ సభ, 30 అసెంబ్లీ సీట్లతో తెలుగువారి జనాభా ఎక్కువ. 79 ఏళ్ల గమాంగ్ 1999లో కేవలం పదినెలలు సీఎంగా పనిచేశారు. ఒడిశా ప్రజలు బిజూజనతాదళ్ నేత అయిన సీఎం నవీన్ పట్నాయక్ పాలనవైపే మొగ్గుచూపుతుండడంతో బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. 147 స్థానాలున్న అసెంబ్లీలో బీజేడీకి ఏకంగా 114 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి 22, కాంగ్రెస్ కు 9 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గమాంగ్ బీఆర్ఎస్‌కు ఎన్నిసీట్లు తెచ్చిపెడతారనేది తెలియాలంటే ఎన్నికలు వచ్చేవరకు ఆగాల్సిందే. ఒడిశా అసెంబ్లీకి వచ్చే ఏడాది జూన్ లో ఎన్నికలు జరగనున్నాయి.