సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా ఏపీలో రాజకీయం ఆ దిశగా ఎప్పుడో మొదలయ్యాయి. లోకేశ్ పాదయాత్ర, జనసేన తనదైన శైలిలో చేసే కార్యక్రమాల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా అప్రమత్తమైంది. ప్రజల్లో పట్టున్న టీడీపీ నాయకులకు గాలం వేస్తోంది. తాజాగా టీడీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేని వైసీపీ తనలో చేర్చుకుంది. కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు వైఎస్ జగన్ సోమవారం పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. మంత్రి కారమూరి మధ్యవర్తిత్వంతో వెంకటరమణ పార్టీ మారారని చెప్తున్నారు. ఇక పార్టీలో చేరిన వెంటనే వెంకటరమణకు నలుగురు గన్‌మెన్లను కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక, ఎమ్మెల్సీ పదవికి హామీ ఇచ్చారని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటును వెంకటరమణకు జగన్ కేటాయించారని సమాచారం. ఈ పరిణామంతో కైకలూరు నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దెబ్బ పడినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.