నోబెల్ బహుమతి గ్రహీత పచౌరి కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

నోబెల్ బహుమతి గ్రహీత పచౌరి కన్నుమూత

February 14, 2020

RK Pachauri.

ప్రముఖ పర్యావరణవేత్త ఆర్‌కే పచౌరీ (79) గురువారం మృతిచెందారు. హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతిని తేరి డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ శుక్రవారం వెల్లడించారు. గతేడాది జులైలో గుండెపోటుకు గురైన ఆయనకు ఎస్కార్ట్ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అప్పటినుంచి ఆయనకు గుండెజబ్బు మరింత తీవ్రతరం అయింది. దీంతో ఇటీవల ఆయన ఆ ఆసుపత్రిలో చేరారు. అయితే మంగళవారం నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. చికిత్స పొందుతూ కన్ను మూశారని వైద్యులు తెలిపారు. 

ఆయన న్యూఢిల్లీలోని ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (తేరి) వ్యవస్థాపక అధ్యక్షుడిగా,  ఐక్యరాజ్యసమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ)కి చైర్మన్‌గా పనిచేశారు. పచౌరీ నేతృత్వంలోని ఐపీసీసీ నోబెల్ బహుమతి అందుకుంది. మానవ నిర్మిత వాతావరణ మార్పుకు సంబంధించిన అవగాహన పెంపొందించడానికి, వ్యాప్తి చేయడానికి, దానిని ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలకు విశేష కృషి చేసిందుకుగాను ఈ అవార్డు లభించింది. కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన తేరి డైరెక్టర్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన మృతిపై పలువురు పర్యావరణవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.