మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా మల్టీఆర్గాన్ డిసిన్ఫెక్షన్ సిండ్రోమ్ సెప్సిస్‌తో బాధపడుతున్నారు. చికిత్స కోసం జూన్ 25న ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం 6.55కు తుదిశ్వాస విడిచారు.
ఆయన 1938, జనవరి 3న రాజస్థాన్‌లోని జసోల్‌లో జన్మించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు పొందారు. 1998-99 వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. పలుమార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. 1980 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004-2009 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జశ్వంత్‌సింగ్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.