Fortune knocked on the door..Lakhs of debt cleared
mictv telugu

అదృష్టం తలుపు తట్టింది..లక్షల అప్పు తీరింది

July 27, 2022

దేశవ్యాప్తంగా ఈ మధ్య సోషల్ మీడియాలో ‘లాటరీ’లకు సంబంధించిన కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో నివాసముంటున్న జమాల్ సింగ్ అనే తోపుడు బండి వ్యాపారి కూతురు రూ.100 రూపాయలతో లాటరీ టికెట్ కొంటే ఏకంగా రూ.10 లక్షల రూపాయలను గెలుచుకుంది. దాంతో ఆ కుటుంబం రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యింది. ఆ సంఘటన మరవకముందే కేరళ రాష్ట్రంలో మరో లాటరీ సంఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..కేరళలోని కోజికోడ్‌కు చెందిన 50 ఏళ్ల మొహమ్మద్ బవా అనే వ్యక్తి పెయింటర్ పని చేస్తున్నాడు. అతనికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూతుళ్లకు ఇటీవలే పెళ్లి చేసి, ఎనిమిది నెలల కిందట ఇల్లు కట్టుకున్నాడు. ఈ క్రమంలో మొహమ్మద్ బవా బ్యాంకులు, బంధువుల దగ్గర దాదాపు రూ.50 లక్షలు అప్పు చేశాడు.

అంతేకాదు, తన కుమారుడు నిజాముద్దీన్‌ను ఖతార్‌ చదువుకు సంబంధించి డబ్బులను పంపించేందుకు మరికొంత అప్పు చేశాడు. ఈ క్రమంలో గతకొన్ని రోజులుగా అప్పు ఇచ్చిన వాళ్లు డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఒత్తడి తట్టుకోలేక, చేసేది ఏమీలేక 2000 చదరపు అడుగుల ఇంటిని 40 లక్షల రూపాయలకు విక్రయించేందుకు సోమవారం అడ్వాన్స్ తీసుకోబోతుండగా అతనికి జాక్‌పాట్ తగిలింది.

తాజాగా మొహమ్మద్ బవా.. హోసంగడిలోని ఓ ఏజెన్సీలో లాటరీని కొనుగోలు చేశాడు. ఆ లాటరీని డ్రా తీయగా బవాను అదృష్టం వరించింది. ఏకంగా కోటి రూపాయలను గెలిచుకున్నాడు. ఆ విషయాన్ని లాటరీ యాజమాన్యం బవాకు ఫోన్ చేసి తెలియజేశారు. దాంతో ఆయన చెప్పలేనంత ఆనందంతో గెంతులు వేశాడు. తమ అప్పులు, కష్టాలు తీరిపోతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, సోమవారం సాయంత్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇల్లు కొనడానికి పార్టీతో ఇంటికి రాగా, తాను ఇల్లు అమ్మడం లేదని అసలు విషయం చెప్పాడు. చేసిన అప్పులు తీరగా బవాకు రూ. 63 లక్షలు చేతికి అందాయి.