యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు ఖమ్మం చేరుకున్నారు. హెలికాఫ్టర్ల ద్వారా ఖమ్మం చేరుకున్న తర్వాత అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలను ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రివాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌లతో కలసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
అనంతరం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం. సీఎం కేసీఆర్ సహా… కేరళ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు కంటి వెలుగును ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్ భవనంలోనే కంటివెలుగు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామ, మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులను సర్కారు ఏర్పాటు చేయనున్నారు.
మరికాసేపట్లో బీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖమ్మం బీఆర్ఎస్ సభ వేదికగా ప్రసంగించనున్నారు. జాతీయ రాజకీయాల్లో సైతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ విధానాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఈ సభ ప్రారంభం కానుంది.