Four died in a collision between a BMW car and a truck in uttar pradesh
mictv telugu

230kmph వేగం.. చస్తామంటున్నా వినకుండా గుద్దేశాడు.. వీడియో

October 17, 2022

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖరీదైన బీఎండబ్ల్యూ కారు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వెళ్లి ట్రక్కును ఢీకొట్టింది. వేగం తీవ్రత దెబ్బకు కారులో ఉన్న నలుగురు తునాతునకలైపోయారు. ఇటీవల ప్రారంభించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై గత శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, ప్రమాదానికి కారణం అతి వేగమేనని స్పష్టంగా తెలుస్తోంది. ప్రమాదానికి ముందు నలుగురిలో ఒకరు లైవ్ స్ట్రీమింగ్ చేయగా, వేగం గంటకు 230 కిలోమీటర్లకు చేరింది. అప్పుడు అంత వేగం వద్దు. మనం చచ్చిపోతామని మరొక స్నేహితుడు చెప్తుండగా, వీడియో తీస్తున్న వ్యక్తి మాత్రం 300 స్పీడు మీద పోనియ్యమని ప్రోత్సహిస్తున్నాడు. అయితే డ్రైవరు 230 స్పీడు వద్ద కారును కొంచెం స్లో చేయగా, అతడిని వారించి ‘ఎందుకు బ్రేకులు వేస్తున్నావు. ఇలా అయితే మనం వేగం అందుకోలే’మంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇదంతా వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ఈ సంభాషణలు ముగిసిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. కంటైనర్‌ను ఢీకొట్టిన తర్వాత కారు ఇంజిన్ పేలి నలుగురు స్నేహితులు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. అంతేకాక, అక్కడికక్కడే మరణించారు. ఇందులో ఒకరు డాక్టర్, మరొకరు ఇంజినీర్, మిగతా ఇద్దరు వ్యాపారులని పోలీసులు తెలిపారు. అయితే వారు ఆ సమయంలో మద్యం సేవించారా? లేదా? అనేది క్లారిటీ లేదు. అటు ప్రమాదం తర్వాత కంటైనర్ డ్రైవర్ పారిపోయాడు.