సరదా కోసం విహార యాత్రకు వెళ్లిన అమ్మాయిలకు విషాదం ఎదురైంది. జలపాతం వద్ద సెల్ఫీల కోసం ప్రయత్నిస్తుండగా, అదుపుతప్పి పడిపోవడంతో నలుగురు అమ్మాయిలు చనిపోయారు. మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని బెలగావికి చెందిన 40 మంది విద్యార్ధినిలు మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని కిట్వాడ్ జలపాతానికి విహార యాత్రకు వెళ్లారు.
సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఐదుగురు యువతులు అదుపుతప్పి జలపాతంలో పడిపోగా, నలుగురు చనిపోయారు. మరొకరిని అక్కడి సిబ్బంది కాపాడడంతో బతికి బయటపడింది. తీవ్రగాయాల పాలైన సదరు యువతిని బెలగావిలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, చనిపోయిన వారిని ఆసియా ముజావర్ (17), కుద్రషియా హసమ్ పటేల్ (20), రుక్కాషా భిస్తీ (20), తాస్మియా (20)లుగా గుర్తించారు. వీరి మరణంతో విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా మారిపోయింది.