గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండి వ్యవసాయానికి ప్రాణం పోయగా, పట్టణాలు, నగరాల్లో ప్రమాదాల కారణంగా నిండు ప్రాణాలు పోతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కరెంటు షాకుతో చనిపోయారు. వర్షాల వల్ల ఇల్లు మొత్తం తేమకు గురవగా, దాని వల్ల ఇల్లు మొత్తం కరెంటు సరఫరా అయింది.
ఇది గుర్తించని కుటుంబ సభ్యులు ఇంట్లోని వస్తువులను ముట్టుకోవడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను హైమద్ (35), పర్వీన్ (30), పిల్లలు అద్నాన్ (4), మాహిమ్ (6)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు కరెంటు షాకు వల్లే ప్రాణాలు కోల్పోయారని ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.