Four people hanged in Myanmar
mictv telugu

50 ఏళ్లలో తొలిసారి.. మయన్మార్‌లో నలుగురికి ఉరి

July 25, 2022

మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం తమ దేశంలో నలుగురికి ఉరిశిక్ష అమలు చేసింది. జూన్‌లోనే శిక్ష విధించగా, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. దాంతో కొన్నిరోజులు ఆగిన ప్రభుత్వం తాజాగా అమలు చేసింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత మయన్మార్ ఉరిశిక్షను అమలు చేయడం గమనార్హం. ఈ నలుగురిలో ముగ్గురు ప్రజాస్వామ్య కార్యకర్తలు కాగా, ఒకరు అంగ్ సాన్ సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ చట్ట సభ సభ్యుడైన పోయో జియా థావ్. సూకీ ప్రభుత్వం అధికారంలో లేనందున ఈయన మాజీ ఎమ్మెల్యే అనుకోవచ్చు. పోయోను ఉరి తీయడం గురించి తనకు సమాచారం లేదని ఈ సందర్భంగా ఆయన భార్య మీడియాకు తెలిపారు. వీరందరూ హింస, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందున ఉరిశిక్ష విధించామని సైనిక పాలకులు ప్రకటించారు. కాగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని గతేడాది సైనిక పాలకులు కూల్చివేశారు. ఆమెపై అనేక ఆరోపణలు చేసి జైలుకు పంపారు. వాకీటాకీల దిగుమతి, కరోనా నిబంధనల ఉల్లంఘన వంటి కేసులను కోర్టులో వేసి తీర్పు తమకు అనుకూలంగా తెచ్చుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన అంగ్ సాన్ సూకీ ప్రస్తుతం నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.