నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో పెద్దపులి పిల్లలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బహిర్భూమికి వెళ్లిన ఓ యువకుడికి ఆ పిల్లలు కనిపించాయి. వెంటనే భయపడి వాటి గురించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. నల్లమల అటవీ ప్రాంత నుంచి తప్పించుకుని ఊరి చివర పంట పొలాల్లోకి ఆ పిల్లలు వచ్చాయని సమాచారం. స్థానికులు ఆ పులి పిల్లలపై కుక్కలు దాడి చేస్తాయని.. వాటిని తీసుకెళ్లి ఓ గదిలో భద్రపరిచారు. వాటిని చూసేందుకు చుట్టుపక్కల ఊర్ల జనాలు కూడా వస్తున్నారు. కొందరు ఆ పిల్లలతో సెల్ఫీలు దిగారు.
ఒకేసారి 4 పిల్లలు కనిపించడంతో వాటి తల్లి పెద్దపులి మళ్లీ వస్తుందేమోనని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పులి పిల్లలను తీసుకొచ్చి ఓ గదిలో ఉంచి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు పులి పిల్లల్ని స్వాధీనం చేసుకోనున్నారు. అయితే ఈ పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలా?.. లేక జూకు తరలించాలా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ పిల్లలను జూకి తరలిస్తే తల్లి పులి వీటి కోసం గ్రామంలోకి చొరబడి ప్రజలపై దాడి చేసే అవకాశముందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అలాగని అటవీ ప్రాంతంలో వదిలేసే కుక్కలు, ఇతర జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వీటిని ఎక్కడికి తరలించాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.