హారన్ కొట్టకుండా.. వేరే వెహికిల్స్ ని ఓవర్ టేక్ చేయకుండా మన హైదరాబాద్ నగరాన్ని ఊహించుకోగలమా? కచ్చితంగా లేదని చెప్పొచ్చు. మన దగ్గరనే కాదు.. భారతదేశంలో అలా కనపడవనే సమాధానం వస్తుంది. కానీ మన దగ్గర కూడా ఒక సైలెంట్ సిటీ ఉంది. దాని దగ్గరకే ఈ పయనం..
రద్దీగా ఉండే ట్రాఫిక్ కు పేరుగాంచిన అనేక నగరాలు భారతదేశంలో ఉన్నాయి. అయితే ట్రాఫిక్ ఎలా సమర్థవంతంగా నిర్వహించవచ్చో చాలా నగరాలు ఇప్పటికీ తెలుసుకోలేదు. తెలుసుకుంటాయని కూడా మనం అనుకోలేం. కానీ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకుండా బండి వెనుక బండి వెళ్లడం.. కారు వెనుక కారు వెనుక కారు వస్తుందని ఊహించుకుంటేనే కొత్తగా ఉంది కదా! ఈ సైలెంట్ సిటీ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతున్నది.
మిజోరాంలోని ఈ నగరం మీ మనసు దోచుకుంటుంది. ఐజ్వాల్ నుండి ఒక వీడియో ఇన్ స్టాలో ఇప్పుడు వైరల్ అవుతున్నది. గందరగోళం లేకుండా.. నగరంలో ట్రాఫిక్ అప్రయత్నంగా కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను ఎలిజబెత్ అనే యూజర్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఐజ్వాల్ నగర వీడియోలో.. రోడ్డుకు కుడి వైపున పార్క్ చేసిన కార్లను చూడవచ్చు. ఇతర వాహనాలు క్యూలో కదులుతున్నట్లు కనిపిస్తాయి. ఎక్కడా ఓవర్ టేక్ చేసినట్లు కూడా కనిపించదు. అదే విధిలో ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక లైన్ ఉంది. ద్విచక్ర వాహనాల పై వెళ్లే వారందరూ హెల్మెట్ ధరించడం కూడా గమనార్హం. లేన్ మార్కింగ్ లేదా బ్లాక్స్ లేనప్పటికీ, ప్రయాణికులు స్వయంగా లేన్ ట్రాఫిక్ ను నిర్వహించడం కనిపిస్తుంది. ‘భారతదేశం ఏకైక నిశ్శబ్ద నగరం’ అని ఈ నగరానికి పేరుంది.
పోస్ట్ చేసిన ఎలిజబెత్.. ‘మీరు భారతదేశంలో నివసిస్తుంటే లేదా ఏదైనా భారతీయ నగరాలకు వెళ్లి ఉంటే ట్రాఫిక్ జామ్ ఎంత తీవ్రంగా ఉంటాయో మీకు తెలిసి ఉండవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ వంతుగా కచ్చితమైన రూల్స్ పాటిస్తున్నారు’ అంటూ రాసింది.
ఈ వీడియో ఇప్పటికే 5.6 మిలియన్ల మంది చూశారు. ఒక మహిళ ‘ఈ ప్రాంతం నాకు తెలుసు. నాకు చాలా ఇష్టం. షిల్లాంగ్, దాని పక్కన నగరాల్లో కూడా కఠిన ట్రాఫిక్ నియమాలు ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది’ అంటున్నది. మరి మన హైదరాబాద్లో ఆ రూల్ వస్తుందని మీరనుకుంటున్నారా??