ఊరి ప్రజల మధ్య చిచ్చుపెట్టిన నక్క.. - MicTv.in - Telugu News
mictv telugu

ఊరి ప్రజల మధ్య చిచ్చుపెట్టిన నక్క..

February 10, 2018

నక్క ఊళలు కీడును సూచిస్తాయంటారు. కానీ నక్క తోక తొక్కితే అదృష్టం అని కూడా చెప్పుకుంటారు. చిత్రమైన లోకం. మనవైపు నక్కలు ఊళ్లలో కనిపించవు. అయతే బ్రిటన్‌లోని కొన్న ఊళ్లలో నక్కలు వీధి కుక్కల్లా తిరుగుతూ ఉంటాయి. వాటిని కొందరు పెంచేసుకుంటూ ఉంటాయి.

విషయం ఏమంటే.. అలా ఊరిమీద పడి తిరుగుతున్న ఒక నక్క ఊరి ప్రజలను రెండుగా చీల్చింది. శామ్ అని పిలుచుకుంటున్న ఈ నక్కను ఊర్లోంచి తరిమేయాలని కొందరు, కాదు.. అది రాముడు మంచి బాలుడు టైపులో మంచి నక్క అని, ఉండనివ్వాలని కొందరు కొట్టాడుకుంటున్నారు.

మెయిడ్‌స్టోన్ లోని కెంట్ అనే ప్రాంతంలో ఒక ఒంటరి నక్క మూడేళ్లుగా తిరుగుతోంది. పసికూనగా ఉన్నప్పుడు అది దగ్గర్లోని పొదల్లోంచి వచ్చింది. ఇప్పుడు దానికి మూడేళ్లు. కెంట్‌లోని పదికిపైగా కుటుంబాలు దానికి పిజ్జాలు, కోడికాళ్లు, చేపలు, బ్రెడ్డు వగైరా వేస్తున్నారు. అదికూడా కుక్కలా విశ్వాసంగా వారిళ్లకు వెళ్తూంటుంది. పొద్దున్నే వాకిలి వద్ద కూర్చుని ఈ రోజు ఏం పెడతారా అని ఎదురూ చూస్తూ ఉంటుంది. శామ్ ఎవరినీ ఏమీ అనదు. తన మానాన తాను తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా తిండిపెడితే తోక వూపుకుంటూ తినేస్తుంది. ఐస్ క్రీమ్ పెడితే నాకేస్తుంది.

అయితే కొందరికి ఈ నక్క నచ్చడం లేదు. ఎంతైన అడవి జంతువు అడవి జంతువేనని, దానివల్ల తమ పెంపుడు పిల్లులకు, కుక్కలకు, కుందేళ్లకు హాని ఉందని భయపడుతున్నారు. శామ్ ఇటీవల ఓ స్కూల్ వద్ద తచ్చాడడంతో గొడవ ముదిరింది. దానివల్ల పిల్లలకు ముప్పు అని కొందరు గగ్గోలు పెడుతున్నారు. దాన్ని పట్టుకోవడానికి వలలు కూడా వేశారు. అయితే ఆ వలలో ఓ పిల్లి చిక్కుకుంది. తెలివైన శామ్.. ఎవరికీ చిక్కకుండా ఎంచక్కా కెంట్ ఇళ్లలో ఆతిథ్యం స్వీకరిస్తోంది…!