పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ సర్కార్ దూసుకుపోతోంది. మంత్రి కేటీఆర్ హయాంలో పలు ప్రముఖ కంపెనీలు తెలంగాణ వేదికగా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి.తాజా మరో పెద్ద సంస్థ ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’(Hon Hai Fox Conn) రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చింది. ఈ మేరకు కంపెనీ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలో ప్రతినిధి బృంధం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం లక్ష ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’తో ఒప్పందం ఒకటిగా ఉంటుంది.
తెలంగాణలో తమ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ సంస్థకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడును రప్పించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని సీఎం అన్నారు. కంపెనీ ఏర్పాటు చేయడం ద్వారా లక్ష కు పైగా ఉద్యోగాలు సృష్టించొచ్చని ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ చైర్మన్ యంగ్ ల్యూ తెలిపారు. ఈ ఉద్యోగాలన్నీ తెలంగాణ యువతకే దక్కేటట్లు కృషి చేస్తామని తెలిపారు.