బాలికకు కుటుంబీకుల శిరోమండనం.. వారిని దేశం వెలేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

బాలికకు కుటుంబీకుల శిరోమండనం.. వారిని దేశం వెలేసింది..

October 25, 2020

Head shaving

ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని భావించేవారు మనదేశంలోనే కాదు అంతటా ఉన్నారు. సాంప్రదాయాలను గౌరవిస్తున్న పెద్దలకు ప్రేమికులు దోషుల్లా కనిపిస్తున్నారు. మనవద్ద వేరే వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జరుగుతున్న దారుణాల గురించి తెలిసిందే. అయితే ఓ దేశంలో వేరే దేశస్థుడిని ప్రేమించిందని ఓ మైనర్ బాలికని కుటుంబీకులే శిరోమండనం చేశారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మైనర్ బాలిక పట్ల పెద్దలు చేసిన తప్పును నేరంగా పరిగణించి, తల్లిదండ్రులతో పాటు మొత్తం ఐదుగురిని దేశ బహిష్కరణ చేసింది. ఈ ఘటన ఫ్రాన్స్‌లో దేశంలో చోటు చేసుకుంది. బోస్నియా దేశానికి చెందిన ఓ కుటుంబం ఫ్రాన్స్‌లోని బెసాన్‌కాన్‌ నగరంలో గత రెండు సంవత్సరాల క్రితం వలస వచ్చి నివసిస్తున్నారు. ఆ కుటుంబానికి చెందిన ఓ 17ఏళ్ల మైనర్‌ యువతి అదే భవనంలో ఉంటున్న సెర్బియా దేశానికి చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రేమలో పడ్డారు. 

వారివి దేశాలే కాదు, మతాలు కూడా వేరు. అయినా వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంతలో ఈ విషయం కాస్తా బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో యువతిని వారించారు. అయినా ఆ యువతి అతన్నే పెళ్లి చేసుకుంటానని మొండిగా మాట్లాడింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు శారీరకంగా వేధించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆ యువకుడిని మరిచిపోవాలని ఆదేశిస్తూ శిరోమండనం చేశారు. 

ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన బాలిక ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆగస్టు నెలలో ఫ్రెంచ్‌ మీడియా బయటపెట్టింది. అక్కడి ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. విచారణలో భాగంగా అమ్మాయి తల్లిదండ్రులతో పాటు మరో ముగ్గురు సమీప బందువులే బాలికను వేధించారని గుర్తించింది. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా వీరిని బెసాన్‌కాన్‌ నగరం నుంచి బోస్నియా రాజధాని సరజెవోకు తరలించింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాలశాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ మైనర్‌ బాలిక బాధ్యతలను స్థానిక సామాజిక సేవా సంస్థ చూసుకుంటోంది. మేజర్‌ అయిన తర్వాత ఫ్రాన్స్‌లోనే నివసించే హక్కు ఈ అమ్మాయి పొందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, బోస్నియా, సెర్బియా దేశాల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. 1990 సంవత్సరంలో ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధంలో వేలాది మంది పౌరులు మృతిచెందారు.