ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశంలోని యువత కోసం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తొలుత ఆ దేశంలోని 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతకు మాత్రమే ఉచితంగా కండోమ్‌లు అందించనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత మైనర్లకు రక్షణ వద్దా? అన్న విమర్శలు రావడంతో 25 ఏళ్లలోపు మగవారు అందరికీ ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.
ఫ్రాన్స్‌లో ఎయిడ్స్, ఇతర లైంగిక సంక్రమిత వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అవాంఛిత గర్భధారణను అరికట్టేందుకు కూడా ఈ ఉచిత కండోమ్‌లు ఉపయోగపడతాయని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్వయంగా ప్రకటన చేశారు. ఆడ మగ కలయికతో జనాభా నియంత్రణ గాడి తప్పడంతో తోడు లైంగికపరమైన సాంక్రమిక వ్యాధులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కండోమ్‌లను 25 ఏళ్ల వయసు వరకు పురుషులతోపాటు, మహిళలకూ ఇస్తారు.
మరోపక్క, లైంగిక విద్య విషయంలో ఫ్రాన్స్ మెరుగ్గా పనిచేయడం లేదని అధ్యక్షుడు మెక్రాన్ అంగీకరించారు. ‘‘థియరీ కంటే రియాల్టీ ఎంతో దూరంలో ఉందని, ఈ విషయంలో ముందుగా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి’’ అని తెలిపారు. ఫ్రాన్స్ అధికారిక లెక్కల ప్రకారం 2020, 2021 సంవత్సరాల్లో లైంగికపరమైన సాంక్రమిక వ్యాధుల బారినపడిన వారి సంఖ్య 30 శాతానికి పెరిగింది. ఈ వ్యాధుల నివారణతో పాటు జనాభా నియంత్రణలో కూడా తన ప్రభుత్వ నిర్ణయం ఒక చిన్న విప్లవంలా పనిచేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యానించారు. అయితే.. ఇలాంటి పథకాల వల్ల యువత విచ్చలవిడిగా తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందంటున్నారు కొందరు.