కరోనా వైరస్ తో సతమతం అవుతోన్న దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. కరోనా వైరస్ బ్రేక్ అవుట్ అయిన తొలినాళ్లలో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. తాజాగా ఫ్రాన్స్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో అక్కడ మరోసారి లాక్డౌన్ విధించారు. డిసెంబరు 1 వరకు ఫ్రాన్స్ లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ బుధవారం ప్రకటించారు.
‘ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. మొదటి దశ కంటే ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చు. నవంబరు 15 నాటికి సుమారు 9 వేల మందికి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికైనా మనం జాగ్రత్తపడకపోతే సమీప కాలంలో 4 లక్షలకు పైగా అదనపు మరణాలు నమోదయ్యే అవకాశం ఉంది’ అని ఆయన తెలిపారు. గురువారం రాత్రి నుంచి బార్లు, రెస్టారెంట్లు, అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి రాతపూర్వక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మాక్రాన్ స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేశారు.