కరోనా టీకా ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. ఎన్నికల హామీ విలువ ఇంతనా? - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా టీకా ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. ఎన్నికల హామీ విలువ ఇంతనా?

October 23, 2020

Free covid vaccine election promise cost in Bihar and nationwide .jp

కాదేదీ కవితకు అనర్హం అంటారు. ఎన్నికల హామీలకు కూడా కాదేదీ అనర్హం. ఉచిత మిక్సీలు, ఫ్యాన్లు, చీరలు, టీవీల దగ్గర్నుంచి ముక్కుపుడకలు, సైకిళ్ల  వరకు సర్వం సమస్తం ఎన్నికల్లో హామీల్లో ఉంటాయి. ఎలాగైనా సరే గెలిచి తీరాలని మద్యం, డబ్బు పంచడం షరా మూమూలే. కాలానికి తగ్గట్లు ఎన్నికల హామీల్లోనూ కొత్తరకం వస్తువులు చేరిపోతుంటాయి. ఇప్పుడున్నది మామూలు కాలం కాదు, బీభత్సమైన కరోనా కాలం. అందుకే రాజకీయ వైరస్ నాయకుల కన్ను కరోనాపై పండింది. ఆ వైరస్’ను కూడా ఓట్ల రూపంలోకి మార్చుకోడానికి కొత్తకొత్త ఎత్తగడలు మొదలయ్యాయి. 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే కరోనా టీకాను ఉచితంగా వేయిస్తామని బీజేపీ చెప్పింది. ఎంత ఖర్చయినా అమలు చేస్తామని ప్రకటించింది. దీంతో దేశమంతటా కలకలం రేగింది. విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీకి ఇతర రాష్ట్రాల్లోని కరోనా పేషంట్లు కనిపించడం లేదా అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోపక్క..  తమ రాష్ట్రంలోనూ ఉచితంగా టీకా ఇస్తమని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా అన్నాడు. బిహార్ బీజేపీపై జోకులు కూడా వైరల్ అవుతున్నాయి. ‘అందరం బిహార్‌కు పోదాం, టీకా వేసుకుందాం, బతికి బట్టకడతాం..’ అని నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. సరే, రాజకీయాల సంగతి వదిలేద్దాం. ఎన్నికల కరోనా హామీలోకి వచ్చేద్దాం. 

పైకి ఇది చాలా ఖరీదైన హామీగా కనిపిస్తున్నా, మిగతా హామీలతో పోలిస్తే చాలా చవక. ఎలానో చూద్దాం. ప్రస్తుతం మన దేశంలో కరోనా టీకాలు లేవు. కరోనాను తగ్గించడానికి ఉపయోగపడే వ్యాక్సీన్ల పేరుతో ప్రచారంలో ఉన్న టీకాల ధర ఒక్కొక్కటి 5500 రూపాయలు పలుకుతోంది. ఈ లెక్కన బిహార్ ఎన్నికల హామీ విలువను లెక్కగడతాం. బిహార్‌లో ప్రస్తుతం 12వేల యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 12 వేలమందికి టీకా వేయడానికి 6.6 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 7 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరికి టీకా వెయ్యాలంటే 385 కోట్లు కావాలి. ప్రభుత్వాల చెబుతున్న లెక్కలను చూస్తే దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అంటే ఈ కరోనా హామీ విలువ కూడా తగ్గిపోతున్నట్లే లెక్క. ఈ సంగతి తెలిసే బీజేపీ ఓ ప్రయోగంగా కరోనా టీకా హామీని వదిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. ఏపీలో 30 వేల యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి కనుక 16 కోట్లు ఖర్చవుతుంది. ఇక తెలంగాణలో 20 వేల యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. వీరికి టీకా వేయాలంటే 11 కోట్ల రూపాయాలు సరిపోతాయి.