తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి దర్శనం కోసం ఇటీవలే తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పిన విషయం తెలిసిందే. గురువారం ఉగాది సందర్భంగా ప్రయాణీకులకు మరో శుభవార్తను తీసుకొచ్చారు. ఉగాది ఆఫర్‌ను ఆయన ప్రకటించారు. ఏప్రిల్ 2న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజనులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విటర్ వేదికగా ప్రకటించారు.
అయితే, ఈ ఆఫర్ కేవలం ఏప్రిల్ రెండో తేదీ ఉగాది పండుగ సందర్భంగా మాత్రమే కల్పిస్తున్నామని తెలియజేశారు. బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును (65 ఏళ్లు దాటినట్లు) కండక్టర్‌కు చూపించి, ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని ఆయన కోరారు.