టీటీడీ భక్తులకు గమనిక..ఉచిత వివాహాలకు దరఖాస్తులు షురూ - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ భక్తులకు గమనిక..ఉచిత వివాహాలకు దరఖాస్తులు షురూ

July 28, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిరుపేద భక్తులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఆగస్టు 7వ తేదీన టీటీడీలో ఉచిత వివాహాలు జరగనున్నాయని, అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. కావున వివాహాలు చేసుకోవడం ఆర్థికంగా భారం అయిన కుటుంబాలు, పేదలు ఈ కార్యక్రమం ద్వారా వారి బిడ్డలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వివాహాలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఆ ప్రకటనలో..”ప్రస్తుతం పిల్లల వివాహాలు చేయడం పేదలకు అసాధ్యమవుతుంది. కరోనా కారణంగా మధ్య తరగతి కుటుంబాలు అప్పుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో తమ బిడ్డల పెళ్లిలు చేయటం కష్టంగా మారింది. అటువంటి వారికి జగన్ సర్కార్, టీటీడీ అండగా నిలుస్తుంది. మధురమైన ఈ కల్యాణ ఘట్టాన్ని మరుపురానిదిగా మార్చాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టింది. ఈనెల 29వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఆగస్టు 7న రాష్ట్ర మంతటా సామూహికంగా కల్యాణమస్తు కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాం. కల్యాణ తేదీ కంటే ముందుగానే కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి” అని సూచించారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు టీటీడీ సహకారంతో కల్యాణమస్తు పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వం, టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిరుపేదలకు వివాహాలను చేయటం మొదలైంది. ఆర్థికంగా భారం అయిన కుటుంబాలు, పేదలు ఈ కార్యక్రమం ద్వారా వారి బిడ్డలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వివాహాలు చేస్తున్నారు. తిరుమలేశుని సన్నిధిలో ఉంచి పూజించిన వివాహ సామగ్రిని నూతన జంటలకు ఉచితంగా అందజేస్తారు. వాటిలో ముఖ్యంగా బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, బాసికాలతోపాటు మంగళ వాయిద్యాలు, పురోహితులను కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తారు.