రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకా ఫ్రీ.. సీఎం హామీ  - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకా ఫ్రీ.. సీఎం హామీ 

October 22, 2020

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఎప్పుడు వస్తుందా అని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. సస్పెన్స్ సినిమాలా మారిన ఈ కరోనా టీకా గురించి రోజుకొక వార్త వినబడుతోంది. ఎప్పుడు వస్తుందో స్పష్టంగా తెలియదు. అయితే ఈ కరోనా టీకాను రాజకీయ నేతలు అప్పుడే వాడేస్తున్నారు. దాని పేరుతో హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా బీహార్ ఎన్నికల్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రతీ ఒక్క బిహారీకి ఉచితంగా కరోనా టీకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మూడు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. టీకా ఉత్పత్తికి శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభం అవుతుందని.. బీహార్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని మంత్రి తెలిపారు. 

ఇదిలావుండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి కూడా కరోనా టీకా గురించి హామీ ఇచ్చారు. కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వేస్తామని పళనిస్వామి ప్రకటించారు. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న టీకాలు మరికొన్ని నెలల్లోనే అందుబాటులోకి వస్తాయని.. ఒకసారి టీకా అందుబాటులోకి రాగానే రాష్ట్ర ప్రజలందరికీ టీకాను ఉచితంగా వేస్తామని అన్నారు. కాగా, వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పళనిస్వామి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.