భగత్ సింగ్‌కు ఘోర అవమానం.. జయంతి చేసినందుకు వేటు - MicTv.in - Telugu News
mictv telugu

భగత్ సింగ్‌కు ఘోర అవమానం.. జయంతి చేసినందుకు వేటు

October 16, 2018

స్వాతంత్ర్యం కోసం చిర్నవ్వుతో బలిదానం చేసి వీరయోధుడు భగత్ సింగ్‌ను ‘స్వతంత్ర భారతం’లో ఇంత ఘోరంగా ఎవరూ అవమానించి ఉండరు. మనం ఇంకా ఆంగ్లేయుల పాలనలోనే ఉన్నామా? అనే అనుమానం కలుగక మానదు. భగత్ సింగ్ జయంతి వేడుక నిర్వహించినందుకు పలువురు విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు.  

తమిళనాడు కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో ఈ దారుణం జరిగింది. సెప్టెంబర్ 28 మాలతి అనే  పీజీ విద్యార్థిని భగత్ సింగ్ జయంతి నిర్వహించింది. కొద్దిమంది మాత్రమే హాజరైన ఈ కార్యక్రమం పట్టుమని గంట కూడా కొనసాగలేదు. అయితే ఆ జయంతిని నిబంధనలు ఉల్లంఘించి జరిపారంటూ మాలతితోపాటు కొంతమంది విద్యార్థులకు నోటీసు జారీ చేసి సస్పెండ్ చేశారు. ‘భగత్ జయంతి కార్యక్రమానికి అనుమతి లేదు. అయినా మాలతి ధిక్కరించింది. కాలేజీ క్యాంపస్లో ప్రశాంతతను భగ్నం చేసింది.. ’ అని నోటీసుల్లో చెప్పుకొచ్చారు.

 దీనిపై మాలతి మీడియా ముందు గోడు వెళ్లబోసుకుంది. ‘భగత్ జయంతి వేడుకకు అనుమతి ఇవ్వాలని ప్రిన్సిపాల్ను కోరగా అందుకు ఆయన నిరాకరించారు. మా ట్యూటర్ కూడా నో అన్నారు. దీంతో మా డిపార్ట్ మెంట్ హెడ్ ను అడగాలనుకున్నాం. అయితే ఆయన సెలవులో ఉన్నారు. భగత్ సింగ్ యువతకు స్ఫూర్తి. ఆయన జయంతి నేరం కాదు. అందుకే ఆయనను స్మరించుకున్నాం.. ఇది నేరమా? నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కూడా వేధించారు. సస్పెన్షన్ నోటీసులను పోలీస్ స్టేషన్‌కు కూడా పంపారు. మనం ఎక్కడి పోతున్నాం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇలాగేనా మన స్వాతంత్ర్య యోధులను అర్పించే నివాళి? ’ అని ప్రశ్నించింది.