హైదరాబాద్‌కు ఎగిరొచ్చిన..ఫ్రాన్స్ విమానం రంగం - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌కు ఎగిరొచ్చిన..ఫ్రాన్స్ విమానం రంగం

July 7, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మరో విదేశీ దిగ్గజ కంపెనీ ఎగిరొచ్చింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ రూ.1200 కోట్లతో తన కంపెనీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కంపెనీ వైమానిక రంగానికి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుందని పేర్కొన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ..”భారత్‌లో తన తొలి ఎంఆర్‌ఓ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు శాఫ్రాన్‌ ముందుకొచ్చింది. మన దేశంలో ఒక విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదే. శాఫ్రాన్‌ ఎంఆర్‌ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్‌ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుంది. శాఫ్రాన్‌ అతిపెద్ద నిర్వహణ కేంద్రం హైదరాబాద్‌లోనే రాబోతుంది. ఇది వైమానిక, రక్షణ, అంతరిక్ష రంగాల్లో పనిచేస్తుంది. వైమానిక రంగానికి సంబంధించి ప్రొపల్షన్, ఎక్విప్‌మెంట్, ఇంటీరియర్స్‌ తయారీల్లో అగ్రశ్రేణి సంస్థ. గగనతల రవాణాకు సంబంధించి సురక్షితమైన, సౌకర్యవంతమైన సహకారాన్ని ప్రపంచానికి అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 2021 సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం ఈ సంస్థ పరిధిలో 76,800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 15.3 బిలియన్‌ యూరోల విక్రయాలతో ప్రపంచంలో అగ్రస్థానాన ఉంది. జీఈ సంస్థతో కలిసి వాణిజ్య జెట్‌ ఇంజన్లకు సంబంధించి ప్రపంచంలోనే నంబర్‌ 1గా ఉన్న శాఫ్రాన్‌.. హెలికాప్టర్‌ టర్బైన్‌ ఇంజన్లు, లాండింగ్‌ గేర్ల తయారీల్లో కూడా అగ్రశ్రేణి సంస్థగా ఉంది” అని ఆయన అన్నారు.