స్కూల్ ఫీజులపై సుప్రీంను ఆశ్రయించిన తల్లిదండ్రులు - MicTv.in - Telugu News
mictv telugu

స్కూల్ ఫీజులపై సుప్రీంను ఆశ్రయించిన తల్లిదండ్రులు

June 30, 2020

Private School.

లాక్‌డౌన్ సమయంలో యజమానులు అద్దె కోసం అద్దెదారులపై ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాలు చెప్పినా ఎవరు వింటున్నారు. కొందరే ఒక నెల ఊరుకున్నా రెండో నెల నుంచి అడగడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అలాంటి మధ్య తరగతివారిపై ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు అంటూ వేధిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో పనులు లేవు, జీతాలు లేక కన్నవారు తమ పిల్లల విషయంలో ఆందోళన చెందుతున్నారు. వారి భవిష్యత్తు అంధకారం అవుతుందని వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు పాఠశాలలకు మూడు నెలల ఫీజు మాఫీ చేయాలని, పాఠశాలలు మొదలయ్యే వరకు ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది రాష్ట్రాల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో చాలా మంది తల్లిదండ్రులు ఫీజు చెల్లించలేకపోవడంతో పిల్లలను స్కూళ్ల  నుంచి తొలగించవద్దని వారు డిమాండ్ చేశారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రైవేటు పాఠశాలలు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఫీజులను అడగకుండా చూసేలా అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని వారు కోరారు. ఇంటర్ బోర్డు ఫలితాలు ఇంకా రాలేదని, పిల్లలు ఎటువైపు వెళ్ళాలో తేల్చుకోలేని దుస్థితిలో ఉన్నారని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. పిల్లలకు పుస్తకాలు, స్టేషనరీలు లేనందున వారు చదువుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. చాలా మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు లేవు.. అయినా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారని, దీంతో తిండి మానుకుని స్మార్ట్‌ఫోన్లు కొనాల్సి వస్తోందని వారు వాపోయారు. మరి దీనిపై సుప్రీం ఏ విధమైన తీర్పు వెలువరుస్తుందో చూడాలి.