కోటి గెలుచుకున్న కుర్రాడు… కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్..
ఆన్‌లైన్ గేమ్‌లో కోటి రూపాయలకు పైగా డబ్బు గెలుచుకున్నాడు ఓ బీటెక్ స్టూడెంట్. అంత డబ్బు తన సొంతం అవుతున్న విషయాన్ని తన తోటి స్నేహితులతో ఆనందంతో షేర్ చేసుకున్నాడు. ఆయితే ఆ యువకుడిని అభినందించి, ఆనందించాల్సిన అతడి స్నేహితులు డబ్బు కోసం కక్కుర్తిపడ్డారు. అతడి దగ్గరి నుంచి డబ్బును ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని మరిచి ఏడుగురు యువకులు కలిసి అతడిని కిడ్నాప్ చేశారు. కర్ణాటకలోని హుబ్లీ జిల్లాలో జరిగిందీ సంఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. హుబ్లి జిల్లాకు చెందిన గరీబ్ నవాజ్ అనే యువకుడు.. నగరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. దిల్వర్ అనే స్నేహితుడితో కలిసి ఆన్‌లైన్ కసీనో గేమ్ ఆడేవాడు. ఇద్దరికీ బాగా డబ్బులు వచ్చాయి. కొందరు స్నేహితులతో కలిసి ఆ సొమ్ము ఖర్చు చేసేవాడు గరీబ్ నవాజ్. ఫలితంగా.. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్‌లో అతడికి ఏకంగా రూ.1 కోటి వచ్చాయని ప్రచారం జరిగింది.
దీంతో నవాజ్ స్నేహితులు డబ్బు కోసం అతడిని ఈనెల 6న కిడ్నాప్ చేశారు. నవాజ్ తండ్రికి ఫోన్ చేసి.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో.. కనీసం రూ.15లక్షలైనా ఇవ్వాలని, లేదంటే నవాజ్‌ను చంపేస్తామని బెదిరించారు. ఆ బెదిరింపు కాల్స్ వచ్చిన రోజే నవాజ్ తండ్రి హుబ్బళ్లిలోని బెండిగెరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హుబ్లీ ధార్వాడ్ కమిషనర్ లాబూరామ్.. నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ నెట్‌వర్క్ ద్వారా నిందితుల్ని ట్రాక్ చేసి మంగళవారం రాత్రి ఏడుగుర్ని అరెస్టు చేశారు. నిందితులను మహ్మద్ ఆరిఫ్, అబ్దుల్ కరీమ్, హుసేన్ సాబ్, ఇమ్రాన్ మదరాలీ, తౌసిఫ్, మహ్మద్ రజాక్‌గా గుర్తించారు.