భయపెడుతున్న విమాన ధరలు - MicTv.in - Telugu News
mictv telugu

భయపెడుతున్న విమాన ధరలు

March 11, 2022

14

విమాన ప్రయాణికులకు ఆయా సంస్థలు బిగ్‌‌షాక్‌ ఇచ్చాయి. కరోనా కారణంగా బాగా దెబ్బతిన విమాన సంస్థలు.. ప్రయాణ ఛార్జీలను భారీగా పెంచాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే భారత్- అమెరికాతో పాటు మరికొన్ని మార్గాల్లో ఛార్జీలను 100 శాతం వరకు పెంచాయి. మార్చి 27వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఛార్జీల విషయంలో ప్రయాణికులకు ఊరట లభించే అవకాశాలున్నాయి. సర్వీసులు పెరుగుతాయి గనుక రానున్న రోజుల్లో విమాన ఛార్జీలు 40 శాతం తగ్గే ఛాన్స్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో లుఫ్తాన్నా గ్రూపునకు చెందిన స్విస్ సంస్థలు రాబోయే కొన్ని నెలల్లో రెట్టింపు సంఖ్యలో విమానాలు నడపాలని భావిస్తుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ సైతం విమానాల సంఖ్యను 17 శాతంకు పెంచనుంది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కొన్ని నెలల్లో 100 అంతర్జాతీయ విమానాల సర్వీసులు పునరుద్ధరిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఆయా దేశాలతో ఉన్న ఎయిర్ బబుల్ ఒప్పందం మేరకు పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను విమానయాన సంస్థలు నడిపిస్తున్నాయి.

అంతేకాకుండా సర్వీసుల పునరుద్ధరణతో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు తిరిగి కొవిడ్-19 ముందు స్థాయికి వస్తాయని ఇక్సగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలోక్ వాజ్ పేయ్ చెప్పారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో, ముడిచమురుకు అనుగుణంగా విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్గాల్లో విమాన ఛార్జీలను ఎంతవరకు తగ్గిస్తాయో వేచి చూడాలనే మాటా వినిపిస్తోంది. దేశీయంగా చూస్తే, ఈ ఏడాది ఇప్పటికే విమాన ఇంధన ధరలను ఐదుసార్లు పెంచారు. 2021లో ఏకంగా విమాన ఇంధన ధరలు 100 శాతం మేర పెరిగాయి. యుద్ధం కొనసాగితే ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మేకమైట్రిప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేర్ మాగో తెలిపారు.