ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల్ని రక్షించే కార్యక్రమం కన్నా అపరాధుల్ని రక్షించే పనులే ఎక్కువగా జరుగుతున్నాయని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. జైల్లో బంధించిన ఓ నిందితుణ్ని బీజేపీ ఎమ్మెల్యే విడిపించి తీసుకెళ్లిన ఘటనను ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. ‘బేటీ బచావోతో ప్రారంభమైన పథకం కాస్తా అపరాధీ బచావో (నేరగాళ్లను రక్షించడం) దిశగా సాగుతోంది’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
ఆ పోస్టుకు బీజేపీ ఎమ్మెల్యే వ్యవహారాన్ని ప్రచురించిన ఓ పత్రికా కథనాన్ని జోడించారు. దీనిపై ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. ‘ఏ మిషన్ కింద ఈ సంఘటనను చేపట్టారో యూపీ ముఖ్యమంత్రి చెబుతారా? బేటీ బచావోనా లేక అపరాదీ బచావోనా?’ అని ప్రశ్నించారు. కాగా, యూపీలో మహిళలపై ఇటీవల వరుస దారుణాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయా దాడులను ఉద్దేశించి కాంగ్రెస్ గత కొన్ని రోజులుగా అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. హత్రాస్ ఘటనలో యోగీ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొని, ఈ కేసుపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతోంది.