కాశ్మీర్ నుంచి కన్యాకూమారి దాకా.. రాహుల్ గాంధీ పర్యటన - MicTv.in - Telugu News
mictv telugu

కాశ్మీర్ నుంచి కన్యాకూమారి దాకా.. రాహుల్ గాంధీ పర్యటన

May 15, 2022

కాంగ్రెస్ అధిష్టానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా కాశ్మీర్ నుంచి కన్యాకూమారి వరకు భారీ పాదయాత్ర చేపట్టాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దక్షిణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా, నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతూ ఈ పాదయాత్రను కొనసాగించాలని సస్టెయిన్‌ అజిటేషన్ కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఏడాది పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీతోపాటు పలువురు సీనియర్ నాయకులు మధ్య మధ్యలో చేరాలని అధిష్టానం సూచించింది.

ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప చింతన శిబిరం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి సోనియా గాంధీ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు నాయకులు తెలిపారు. ఈ పాదయాత్రలో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో ‘జనతా దర్బార్’ పేరిట భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని పలువురు నాయకులు సూచించారు. దానికి అధిష్టానం కూడా ఓకే చేసిందని, వివిధ అంశాలపై ప్యానళ్ల కన్వీనర్లు అధినేత్రి సోనియాగాంధీకి నివేదికలు సమర్పించారని పేర్కొన్నారు.