ఇక నుంచి ఒకేరకం పరీక్షలకు ఒక్కటే ప్రశ్నపత్రం - MicTv.in - Telugu News
mictv telugu

ఇక నుంచి ఒకేరకం పరీక్షలకు ఒక్కటే ప్రశ్నపత్రం

May 14, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీజీ ప్రవేశ పరీక్షల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పీజీ ఎంట్రన్స్ విషయంలో ఒకటే ప్రశ్నపత్రం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదివరకే అధికారులు.. ఒకేరకం కోర్సులకు కలిపి ఒకటే పరీక్ష జరపాలని, సాధ్యమైనంతలో పరీక్షల సంఖ్య తగ్గించి, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారు.

”తెలంగాణలో ఉన్న ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన వర్సిటీల్లోని అన్ని పీజీ కోర్సులతో పాటు జేఎన్‌టీయూహెచ్‌లో సైన్స్ పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి 2019 నుంచి సీపీ గెట్ నిర్వహిస్తున్నాం. 75 పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు జరపాల్సి వస్తోంది. విద్యార్థులు రెండు, మూడు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఫలితంగా విద్యా సంవత్సరం ఆలస్యమవుతోంది. అందుకే పరీక్షల సంఖ్యను తగ్గించాలన్న లక్ష్యంతో 20 రోజులుగా అధ్యయనం చేస్తున్నాం. దేశంలోని వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే సారూప్య సబ్జెక్టులకు కలిపి ఒక్కటే ప్రశ్నపత్రం ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈసారి కేంద్రం ప్రకారమే ఒకేరకం కోర్సులకు ఒకటే పరీక్ష నిర్వహించాలని నిర్ణయానికి వచ్చాం. ఇప్పటివరకు పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులకు వేర్వేరు ప్రవేశ పరీక్షలు జరుపుతున్నాం. ఈసారి ఒకే పరీక్ష నిర్వహిస్తాం.”