ఇక నుంచి ప్రతీ సిగరెట్‌పై అలా రాస్తాం: కెనడా - MicTv.in - Telugu News
mictv telugu

ఇక నుంచి ప్రతీ సిగరెట్‌పై అలా రాస్తాం: కెనడా

June 13, 2022

కెనడా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే సిగరెట్ల విషయంలో ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించబోతోంది. ఇప్పటి వరకు సిగరెట్ డబ్బిపై ఉండే హెచ్చరికలను ఇకపై ఆ డబ్బిలో ఉండే ప్రతీ సిగరెట్‌పై ప్రింట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సిగరెట్ల బాక్స్‌లపై ఫొటో, సమాచారంతో కూడిన హెచ్చరికలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. కానీ, సిగరెట్లను తాగుతున్న యువత గాని, సిగరెట్ల ప్రియులు గాని ఆ హెచ్చరికలను చూసి ఏ మాత్రం తమ అలవాటును మార్చుకోవటం లేదు.

ఈ క్రమంలో ఇకపై ప్రతి వ్యక్తి సిగరెటును తాగాలంటే ఆలోచించేలా, తమ అలవాటును మార్చుకునేలా ప్రతి సిగరెటుపై ‘ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదు’ అనే హెచ్చిరికను ప్రింట్ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఈ సందేశాలు వాటి కొత్తదనాన్ని కోల్పోయాయి. అవి ప్రభావాన్ని కోల్పోయాన్నదే మా ఆందోళన. ఆరోగ్య హెచ్చరికలను విడిగా ప్రతి పొగాకు ఉత్పత్తిపై ముద్రించడం వల్ల ప్రజలకు సరైన సందేశం చేరడానికి సాయపడుతుంది’’అని కెనడా ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

మరోపక్క శనివారం నుంచి ఈ ప్రతిపాదనపై సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది. 2023 ద్వితీయ భాగం నుంచి కొత్త నిబంధన అమల్లోకి తీసుకురావాలన్నది కెనడా సర్కారు యోచనగా ఉంది. ‘ప్రతీ పఫ్‌లో విషం’ అన్న సందేశం రాయాలన్నది ప్రస్తుత ప్రతిపాదనగా ఉందని బెన్నెట్ తెలిపారు.