From today the National Unity Day celebrations..the schedule is this
mictv telugu

నేటి నుంచే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు: కేసీఆర్

September 16, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు మొదలుకానున్నాయి. ఈ వజ్రోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం రాత్రి అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ వజ్రోత్సవాలు ఎన్ని రోజులు జరగనున్నాయి? ఏఏ రోజున ఏ కార్యక్రమం ఉంటుంది? అనే తదితర విషయాలను తెలియజేశారు.

”రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రోజు నుంచి మూడు రోజులపాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజోత్సవాలు జరగనున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు 15 వేల మందితో ర్యాలీలు నిర్వహించి, తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటాలి. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రతి జిల్లాకు 10 వేల జాతీయ జెండాలను అందించాం. ఈ కార్యక్రమం నిర్వహణ, పర్యవేక్షణకు నియోజవర్గానికి ఒక నోడల్‌ అధికారిని నియమించాం” అని ఈరోజు చేయాల్సిన కార్యక్రమాలను వెల్లడించారు.

ఇక, రేపటి విషయానికొస్తే..భారత్‌ యూనియన్‌లో తెలంగాణ కలిసిన రోజైన సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్‌లో కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవన్‌, సంత్‌ సేవాలాల్‌ బంజారా భవన్లను ప్రారంభిస్తారు. ఆ తరువాత ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభకు ముందుగా నెక్లెస్‌ రోడ్‌ నుంచి గుస్సాడీ, గోండు, లంబాడి తదితర 30 కళారూపాల కళాకారులతో భారీ ర్యాలీ జరుగనుంది. వజ్రోత్సవాలను పురస్కరించుకొని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు.

తలసాని మాట్లాడుతూ..”17న మధ్యాహ్నం 1.00 గంటకు పీవీమార్గ్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచిసెక్రటేరియేట్‌ మీదుగా ఎన్టీఆర్‌ స్టేడియం వరకు ర్యాలీ జరుగుతుంది. కాబట్టి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ర్యాలీలో పాల్గొనాలి. ఈరోజు, రేపు, ఆదివారం జరగబోయే ఉత్సవాలను అందరు కలిసి కట్టుగా నిర్వహించాలి” అని ఆయన పిలుపునిచ్చారు.