నడి ఆకాశంలో నిలిచిపోయిన పక్షి (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

నడి ఆకాశంలో నిలిచిపోయిన పక్షి (వీడియో) 

July 16, 2020

అదొక ఊరు. పట్టపగలు ఎవరి దారిన వాళ్లు వెళ్తున్నారు. కొందరు నింగిలోకి చూస్తున్నారు. వాళ్లను చూసి మరికొందరు అదేంటని చూశారు. అలా ఒకరిని చూసి ఒకరు మొత్తం ఊరంతా దాన్నే చూస్తున్నారు. కానీ, ఎవరికీ అర్థం కావడం లేదు. నింగి మధ్యలో ఒక తెల్లని పక్షి మంత్రం వేసినట్లు ఆగిపోయింది. 

 

కొందరు అది బొమ్మ అనుకున్నారు. కొందరు గాలిపటం అనుకున్నారు.  కెమెరాల్లోంచి జూమ్ చేసి చూశారు. అది బతికి ఉన్న పక్షేనని తేలింది. అనుమానం తీరని మరికొందరు టెలిస్కోపుల్లో చూశారు. అది బతికి ఉన్న అసలైన పక్షి అనే నిర్ధారణకు వచ్చారు. ఆ పిట్ట నింగి మధ్యలో ఎలా ఆగిపోయిందో అర్థం కాక అందరూ జుట్టుపీక్కున్నారు. ఈః వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. 

కొలంబియాలోని తులువా వేల్ పట్టణంలో గతవారం ఈ వింత చోటుచేసుకుంది. పక్షులు ఆకాశంలో ఆగిపోవడం అసంభవం. అవి నింగిలో ఉన్నాయి అంటే ఎగురుతూ ఉన్నట్టే. గద్దలు, రాబందులు వంటి పెద్ద రెక్కల పక్షులు కొన్నిసార్లు ఒకే చోట గిరికీలు కొడుతుంటాయి. చూడ్డానికి నెమ్మదిగా తిరుగుతున్నట్లు అనిపించినా అవి వాటి వేగానికి తగ్గట్టే తిరుగుతుంటాయి. పక్షి ఎగరాలంటే గాలిని తోస్తూ ఉండాలి. కానీ తులువాలో దీనికి భిన్నంగా పక్షి ఎగరకుండా నడి ఆకాశంలో తిష్టవేయడం మిస్టరీగా మారింది. 

మనుషులకు కనిపించని ఏదైనా వైరుకు అది తలుగుకుని ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అక్కడ ఎలాంటి వైరూ లేకపోవడం గమనార్హం. 4జీ ఏంటెనాకు సమీపంలో అది నిలిచిపోయింది. దీంతో రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రేడియేషన్ ప్రభావం వల్ల అది ఆగిపోయి ఉంటుందని కొందరు, పరిశోధకులు దానికి ఏదైనా ఫ్యాన్ లాంటి వస్తువు అమర్చి రిమోట్ సాయంతో ఆపేసి ఉంటారని కొందరు ఏవేవో చెబుతున్నారు.