Fruitful discussions .. Classes from today
mictv telugu

 ఫలించిన చర్చలు.. నేటి నుంచే తరగతులు

June 21, 2022

 

తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గతవారం రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేవరకు తమ నిరసనలు ఆపమని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్‌కు వెళ్లారు. విద్యార్థులతో రాత్రి 9.30 నుంచి రెండున్నర గంటలకుపైగా చర్చలు జరిపారు. ఆ చర్చల్లో విద్యార్థులు డిమాండ్ చేసిన సమస్యల పరిష్కారానికి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో చర్చలు ఫలప్రదమయ్యాయాయి.

అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. ” మా ఆందోళలను విరమించుకుంటున్నాం. మంగళవారం నుంచి తరగతులకు హాజరువుతాం. 12 డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలకు తక్షణమే రూ.5.6కోట్లు మంజూరు చేశారు. గడువులోగా డిమాండ్ల పరిష్కారానికి హామీ, రెగ్యులర్‌ వీసీ నియామకానికి స్పష్టమైన హామీ ఇచ్చారు.” అని అన్నారు.

ఈ చర్చల్లో..ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌, నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ స్టూడెంట్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు, ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, వేణుగోపాల చారి, ఉన్నత విద్యా శాఖ మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకి, స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ విద్యార్థులు పాల్గొన్నారు.