ఎంటో పొద్దున లేస్తే నాకు హీరా టాకూర్ మాటలే వస్తున్నాయి. మా పిల్లలు కూడా ఆయన కొడుకులు, మనుమడు మాట్లాడిన మాటలే చెబుతున్నారు. కొన్ని రోజులుగా నేను కూడా పంచె కట్టుకుని తిరుగుతున్నాను. నా పిల్లలను దొంగతనంగా చూడ్డానికి వెళతున్నాను. ఇంక నా వల్ల కాదు…మా జీవితం మాకు తిరిగి ఇచ్చేయండి బాబోయ్ అంటున్నాడో వ్యక్తి. చూడు….హీరా టాకూర్ లా మారిపోతున్న నన్ను చూడు అంటూ నా గురించి అందరూ చెప్పుకుంటున్నారు అంటూ గగ్గోలు పెడుతున్నాడు. బాబ్బాబు ప్లీజ్ నా లైఫ్ మళ్ళీ నాకు కావాలి తిరిగిచ్చేయండి అని వేడుకుంటున్నాడు. ఏంటిదంతా…దేని గురించి చెబుతున్నాను అనుకుంటున్నారా. వస్తున్నా అక్కడికే.
టీవీలో ప్రతీ వారం టంచన్ గా వచ్చే సూర్యవంశం సినిమా గురించి. తెలుగు సూర్యవంశాన్ని హిందీలో అమితాబ్ తో రీమేక్ చేశారు. అక్కడ కూడా సూర్యవంశం అనే పేరుతోనే వచ్చింది. ఒక హిందీ ఛానెల్ లో ప్రతి ఆదివారం అస్సలు తప్పకుండా ఈ సినిమాను వేస్తున్నారుట. దాన్ని చూడలేక నానా అవస్థలు పడుతున్నాం అంటూ ఓ వ్యక్తి సదరు ఛానెల్ కు లెటర్ రాసాడు. ఆ లెటర్ ఇప్పడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ లెటర్ మీద మరిన్ని పోస్ట్ లు పెడుతున్నారు. మేము కూడా ఉన్నాం మీ లిస్ట్ లో అంటూ మిగతా వాళ్ళు కూడా తమ బాధలను చెప్పుకుంటున్నారు.అవును నేను కూడా ఈ సినిమా రిపీట్ అయినంతగా మరే సినిమాను చూడలేదు అంటూ పోస్ట్ పెట్టారు. మరొకరేమో మీ గాజర్ హల్వాను సూర్యవంశం ఖీర్ మీద పెట్టి వేస్ట్ చేసుకోకండి అంటున్నారు.
అమితాబ్ అంటే మాకు కూడా ఇష్టమే కానీ…ఒకే సినిమాను ఎన్ని ఏళ్ళు ప్రతీ ఆదివారం చూడాలంటూ సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ సినిమా వల్ల మా మానసిక ప్రశాంతత పోతోంది. దానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు అంటూ ప్రశ్నిస్తున్నాడు. అందుకే ప్లీజ్ నా రిక్వెస్ట్ ని ఒప్పుకోండి. నా ప్రశాంతతకు ఇంపార్టెన్స్ ఇవ్వండి అని వేడుకున్నాడు పాపం ఆ వ్యక్తి. అయితే తన పర్శనల్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు. అవి మాత్రం గోప్యంగానే ఉంచాడు. ముంబయ్ లో ఉన్న ఆ ప్రవైట్ ఛానెల్ కు డైరెక్ట్ గా ఉత్తరాన్ని పోస్ట్ చేశాడు. పైగా దానికి రిప్తైని కూడా ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇన్ఫ్మేషన్ యాక్ట్ 2005 కింద ఉత్తరానికి రిప్లై ఇవ్వడం ఛానెల్ బాధ్యతని హెచ్చరించాడు కూడా.
మనలో మన మాట…మన తెలుగు వాళ్ళు కూడా ఇలాంటి బాధితులేనండోయ్. ఆ హిందీ ఛానెల్, సూర్యవంశం సినిమా కాదు కానీ…మా టీవీలో వచ్చే అతడు, బాహుబలి సినిమాలతో మనవీ ఇవే పాట్లు. ప్రతీ వారం వచ్చే ఈ సినిమాలు మనకూ అతనిలాగే కంఠతా వచ్చేశాయంటే అతిశయోక్తి కాదేమో. మనకి కూడా ఈ బాధ తప్పాలంటే మనం కూడా ఇలా ఉత్తరం రాయాలేమో. మీరేమంటారు?